Wednesday, January 23, 2008

ముందుమాట

కళా ప్రియులకు శుభాభివందనములు.

నాట్యం ఒక మహానది. సంగీతం, సాహిత్యం, అభినయం వంటి జీవ నదులు సమపాళ్ళలో సంగమించగా ఒక ఉత్తుంగ తరంగం ఎగసి ఎగసి నింగి అంచును ముద్దాడి కరుణమృత సముద్రుడౌ ఆ నల్లనయ్య పాదలను అభిషేకించి ఈ నేలను పునీతం చేసి నాట్యం గా అవతరించింది. శృతి బద్ధం గా గళములో గీతం కదలాడుతుంటే, లయ బద్ధం గా పాదం కదులుతుంతే దృష్టి చేతుల గమనం మీద లగ్నమై ఆ దృష్టి మనసును మమేకం చేసి భావాన్ని పండించగా రస సిద్ధి కలుగుతుంది. ఆ స్థితి చేసేవారికే కాకుండా చూసేవారికి కూడ కలిగించటమే నాట్యం యొక్క ముఖ్యుద్దేస్యం.

అటువంటి నాట్యం నా జీవన గమనమైనందుకు ఆ నల్లనయ్య కు నా కృతజ్ఞత తెల్పుకుంటున్నాను. నా ఈ బ్లాగ్ ప్రస్తుత నాట్యాభివృద్ధి గురించి ప్రస్తావిస్తూనే నాట్య పూర్వవైభవాన్ని మీ ముందు వుంచుతుంది. ఈ రంగం అభివృద్ధి కి పలు ప్రముఖులు చేసిన కృషి మొదలగునవి ప్రస్తావించబడతాయి. ఇక పై నా టపాలన్నీ నాట్యానికి సంబంధిచినవే కావున ఈ ముందుమాటలో దాని గూర్చి పెద్దగా ఏమీ ప్రస్తావించలేదు.

ధన్యవాదములు.

Tuesday, January 22, 2008

ప్రార్ధన

కంఠేన్యాత్ లంబయేత్ గీతం
హస్తేన అర్థం ప్రదక్షయేత్
చక్షుభ్యాం దర్శయేత్ భావం
పాదభ్యాం తాళం ఆచరేత్

యతో హస్త స్తతో దృష్టి:
యతో దృష్టి స్తతో మన:
యతో మన: స్తతో భావం
యతో భావ: స్తతో రస: